
చిన్నశంకరంపేట, వెలుగు: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం మడూరు గ్రామంలోని శివాలయం వద్ద రాష్ట్రకూట, కల్యాణి చాళుక్య, కాకతీయ శైలి శిల్పాలు గుర్తించినట్లు ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు బుర్ర సంతోష్ తెలిపారు. కళ్యాణి చాళుక్య శైలిలో ఆభరణాలతో చెక్కిన యోగ శయనమూర్తి విగ్రహం, యోగ ముద్రలో శేష తల్పంపై పడుకుని ఉన్న విష్ణుమూర్తి, లక్ష్మీదేవి శిల్పం ద్వారపాలకులు, అష్టభుజి మహిషాసుర మర్ధిని, సరస్వతీ దేవి విగ్రహం, చతుర్భుజ విష్ణుశిల్పం, నాగ దేవతలు, గణపతి సహిత సప్తమాతృకుల విగ్రహం, ఒక వీరగల్లులో కుడిచేత బాకు, ఎడమచేత విల్లుపట్టుకున్న ఎక్కటి వీరుడు మరో శిల్పంలో గుర్రం మీద యుద్ధానికి పోతున్న వీరుడు ఉన్నట్లు వివరించారు. ఈ విగ్రహాలకు కొద్ది దూరంలో పురాతన గుడికి చెందిన రాతి స్తంభాలు పడి ఉన్నాయని, దీన్నిబట్టి ఇక్కడ పురాతన ఆలయం ఉండేదని తెలుస్తోందన్నారు.